కణ కణ మండే నిప్పులా శింబులో రోషగాడు బయటపడ్డాడా?

0

వివాదం కేరాఫ్ శింబు. అది ఒకప్పుడు… ఇప్పుడు చూశారుగా ఎలా మారాడో? అతడి జీవితంలోకి ఒక వనిత ప్రవేశించబోతోంది. అందుకే ఈ అనూహ్య మార్పు!! అంటూ ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి వాడిగా పేరు ఘడించి కెరీర్ పరంగా జీరో అయిపోయిన అతడిని లేపేందుకు ఆ వనిత ప్రయత్నిస్తోందని కూడా గుసగుసలు వినిపించాయి. ఆ కాబోయే భాగస్వామి కం వనిత ఎవరు? అంటే.. త్రిష అంటూ గుసగుసలు వినిపించాయి.

శింబు నటిస్తున్న తాజా చిత్రం `ఈశ్వరన్` నుండి సింబు ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. కేవలం ఈ లుక్ కోసమే అతడు ఎంతగా మారాడో అర్థమైంది. గత కొన్ని నెలల పాటు వ్యాయామం చేయడమే గాక తిండి కట్టేశాడు. అవసరం మేర దినుసులు ఆహారంగా తీసుకున్నాడు. ఆ ప్రతిఫలం పోస్టర్ లో చాలా స్పష్ఠంగా కనిపించింది. సింబు తన కెరీర్ బెస్ట్ లుక్ లో కనిపించాడు. ఈశ్వరన్ కి నా పేరు శివ ఫేం సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే రచన – దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత వారం దిండిగల్ లో మొదలైంది. వచ్చే ఏడాది పొంగల్ సందర్భంగా రిలీజ్ చేసేయాలన్నది ప్లాన్ అని తెలిసింది.

తాజాగా శింబు కొత్త ఫోటోషూట్ అంతే వేడి పెంచుతోంది. ఈ ఫోటోషూట్ లో అతడు టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఆ కోరమీసం గుబురు గడ్డం స్టైల్.. కనుబొమలు ఎగురవేస్తూ వీరుడిలా నిలుచుకున్న విధానం ప్రత్యేకంగా యూత్ లో హాట్ టాపిక్ గా మారాయి. శింబు ఈసారి సంథింగ్ స్పెషల్ గా కనిపించబోతున్నాడని ఈ లుక్ చూస్తే అర్థమవుతోంది.

ఇక శింబు మూడు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అతడు తన ట్విట్టర్ ఫేస్ బుక్ ఖాతాలను తిరిగి రీఓపెన్ చేసాడు. తన శారీరక పరివర్తనను చూపించే వీడియోలను కూడా పంచుకున్నాడు. అతను విన్నైతండి వరువాయలో ఉన్న ఆకృతికి తిరిగి మారాడా? అంటూ టాపిక్ వేడెక్కించింది కూడా. ఊహించని విధంగా గణనీయమైన బరువు తగ్గడం ఆశ్చర్యపరిచింది.

శింబు దాదాపు ఐదు సంవత్సరాలుగా తీవ్రమైన క్రైసిస్ లో ఉన్నాడు కెరీర్ పరంగా.. అతను తన ప్రేమాయణాల విషయంలో అనేక వివాదాలలో చిక్కుకున్నాడు.. ‘బీప్ సాంగ్’ రాసి పాడడం మహిళలల్లో వ్యతిరేకతను తెచ్చింది. అత్యంత అభ్యంతరకరంగా ఉందని విమర్శలొచ్చాయి. కొంతమంది నిర్మాతలు సింబూను `వృత్తిపరంగా పనికి రాడు` అంటూ వెలి వేశారు. సెట్లకు సరిగా రాడు అంటూ ఆరోపించడానికి పత్రికా సమావేశాలు నిర్వహించారు. అతడి వల్ల భారీ నష్టం తప్పలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.

చాలా గ్యాప్ తర్వాత వరుసగా మూడు సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. సుశీంద్రన్.. వెంకట్ ప్రభు వంటి స్టార్ డైరెక్టర్లతో పని చేస్తున్నాడు. ఇంతకుముందు వెంకట్ ప్రభు తెరకెక్కించిన మానాడు విషయంలో ఘర్షణ తెలిసిందే. మేకర్స్ శింబును ప్రాజెక్ట్ నుండి తొలగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడంలో చాలా ఆలస్యం జరిగిందని శింబు వల్లనే అని కూడా ఆరోపించారు. .. టిట్-ఫర్-టాట్ తరహాలో తన తండ్రి టి రాజేందర్ తో కలిసి బ్లాక్ బస్టర్ కొట్టేస్తానని శింబు ప్రకటించాడు. కానీ ఇప్పటివరకూ ఏదీ లేదు.

అయితే గత ఏడాది నిర్మాత సురేష్ కామచ్చితో శింబు అనూహ్యంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను మళ్ళీ మానాడులో నటించాడు. ఈ చిత్రంలో ఎస్.జె సూర్య- ఎస్ఐ చంద్రశేఖర్- మనోజ్ భారతీరాజా- డేనియల్ పోప్- వై గీ మహేంద్రన్- కరుణకరన్- ప్రేమ్గి అమరన్ కూడా నటించారు. మనాడు షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.