Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ఇంటిగుట్టు’ విప్పేసిన సూర్యకిరణ్

‘ఇంటిగుట్టు’ విప్పేసిన సూర్యకిరణ్


ఎన్నో అంచనాలతో ప్రారంభమైన బిగ్బాస్-4 రియాలిటీ షో ఎందుకో కాస్త డీలా పడింది. చెప్పుకోదగ్గ స్థాయిలో సెలబ్రిటీలు లేకపోవడం.. ఉన్నవాళ్లు కూడా ఆశించిన స్థాయి లో ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వక పోవడం తో ప్రస్తుతం చప్పగా సాగుతోంది ఈ గేమ్ షో. అయితే రీసెంట్గా వైల్డ్కార్డు ఎంట్రీతో హౌస్ లోకి అడుగు పెట్టిన కుమార్ సాయి ఏమన్నా కామెడీ చేస్తాడేమోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తొలివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ బిగ్బాస్ హౌస్ గురించి పలు ఆసక్తి కర అంశాలు చెప్పాడు. సాధారణంగా హౌస్ నుంచి బయటకు వచ్చినవాళ్లను న్యూస్ చానళ్లు వెంబడించి వేటాడి మరి ఇంటర్వ్యూలు చేస్తుంటాయి. వాటిని తప్పు పట్టలేం. టీఆర్పీల కోసం వాళ్ల ఆరాటం వాళ్లది. అదే తరహాలో మీడియాకు చిక్కిన సూర్య కిరణ్ బిగ్బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర అంశాలు బయటపెట్టాడు.

డబ్బుకోసం మాత్రం రాలేదండి..
తాను డబ్బు కోసం మాత్రమే బిగ్బాస్ హౌస్లోకి రాలేదని సూర్యకిరణ్ స్పష్టం చేశాడు. ‘సత్యం సినిమా హిట్ అయ్యాక నేను హైదరాబాద్ లో ఉండి పోయాను. ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా చేశాను. కానీ వ్యక్తిగత కారణాలతో చెన్నై వెళ్లిపోయాను. కానీ ఆ సమయంలో వచ్చిన ఓ వార్త నన్ను ఎంతో బాధించింది. నేను చనిపోయానంటూ కొన్ని వెబ్సైట్లు వార్తలు రాశాయి. అటువంటి వాళ్లకు సమాధానం చెప్పేందుకు ఓ సినిమాను తీద్దామని ప్లాన్ చేశాను. అందుకోసం స్టోరీ కూడా రాసుకున్నాను. కానీ దురదృష్టం. అప్పుడే కరోనా రావడంతో నా అంచనాలు తలకిందులయ్యాయి. అదే సమయంలో బిగ్బాస్ నుంచి నాకో ఆఫర్ వచ్చింది. ఇది తెలుగులో అతిపెద్ద గేమ్ షో. ఇందులో పాల్గొంటే ఉనికిని కాపాడుకోవచ్చని భావించాను. కనీసం ఓ నాలుగువారాలపాటు ఉంటాననుకున్నాను. కానీ తొలివారంలో వెళ్లిపోవడం బాధగా అనిపిందచింది. నేను వాళ్లిచ్చే రూ.50 లక్షల కోసం మాత్రం రాలేదు’

అక్కడందరూ తోపులే..
‘బిగ్బాస్ హౌస్లో అమ్మ రాజశేఖర్ తప్ప సినిమాలతో జనాల ఆదరణ సంపాదించిన వారు ఎవరూ లేరూ. కానీ అందరూ పెద్ద సెలబ్రిటీల్లా ఫీలవుతూ ఉంటారు. నాలుగు మంచి విషయాలు చెప్పినా వినిపించుకోరు. నాకు ప్రతిరోజూ చాలా భారంగా గడిచేది. హౌస్లో కంటెస్టెంట్ల ఎవరూ సహజంగా ప్రవర్తించరు. అందరూ నటించేవాళ్లే. బిర్యానీని ఎప్పుడూ చూడనట్టు వింతగా ప్రవర్తిస్తారు. వర్షం రాగానే అదో వింతలాగా ఫీలయి పోతుంటారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు డ్రామాలు చేస్తారు. వాళ్ల ధోరణి నాకు ఎంతో అసహజం గా అనిపించేది. బహుశా అందుకే నేను ఎక్కువ కాలం ఉండ లేక పోయానేమో’

వాళ్లంతా బాగా ముదిరి పోయారు
‘హౌస్ లోకి వచ్చిన వాళ్లంతా ముందస్తుగా చాలా ప్రిపేర్ అయ్యారు. వాళ్లకు ఉన్నన్ని తెలివితేటలు నాకు లేవు. షోలో ఎక్కువసేపు పాజిటివ్గా కనిపించాలంటే ఏం చేయాలో వాళ్లంతా చాలా అధ్యయనం చేశారు. ఇంతకు ముందు కంటెస్టెంట్లతో మాట్లడి నేర్చుకున్నారు. ఓవర్ ఎక్స్ప్రేషన్స్ ఉంటేనే ఫుటేజీ ప్రేక్షకులకు కనిపిస్తుందని వాళ్లకు బాగా తెలుసు. అయితే నేను నాలా ఉన్నాను. అందుకే తొందరగా వచ్చానని భావిస్తున్నాను’ అంటూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు సూర్యకిరణ్.