విద్యార్థి కోసం బస్ టైమింగ్ మార్చారు..

0

ఒకే ఒక్క విద్యార్థిని కోసం జపాన్ ప్రభుత్వం ఏకంగా కొన్నేళ్లపాటు రైలు నడిపిన సంగతి తెలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే మనదగ్గరా జరిగింది. ఒడిశాలో ఓ విద్యార్థి కోసం బస్ టైమింగ్ మార్చి అధికారులు అందరి మన్ననలు పొందుతున్నారు.

భువనేశ్వర్ లోని ఎంబీఎస్ పబ్లిక్ స్కూలులో ఏడో తరగతి చదువుతున్న సాయి అన్వేష్ ప్రధాన్ రోజూ ప్రజా రవాణా సంస్థ బస్సులోనే స్కూలుకు వెళ్తుంటాడు. అయితే, అతడి స్కూలు ఉదయం 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. కానీ అన్వేష్ వెళ్లే బస్సు మాత్రం 7.40 గంటలకు వస్తోంది. దీంతో ప్రతిరోజూ స్కూలుకు ఆలస్యమవుతోంది. దీంతో రోజూ టీచర్ చీవాట్లు తప్పడంలేదు. పైగా పాఠాలు కూడా మిస్ అవుతున్నాడు.

ఇక విసిగిపోయిన అన్వేష్.. ట్విట్టర్ వేదికగా తన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. బస్ టైమింగ్ అనుకూలంగా లేకపోవడం వల్ల రోజూ స్కూలుకు లేట్ అవుతోందని, దయతో తన ఇబ్బందిని అర్థం చేసుకుని స్కూలుకు టైముకు వెళ్లేలా సహకరించాలని కోరుతూ ట్వీట్ చేశాడు. క్యాపిటల్ రీజియన్ అర్బన్ ట్రాన్స్ పోర్టు (సీఆర్టీయూ) ఎండీ అరుణ్ బోత్రాకు ఆ ట్వీట్ ట్యాగ్ చేశాడు. వెంటనే ఆయన స్పందించారు. బస్ టైమింగ్స్ మారుస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే టైమింగ్ మార్చారు. దీంతో అన్వేష్ అప్పటి నుంచి టైముకు స్కూలుకు వెళ్తున్నాడు.

తన మొర ఆలకించి బస్ టైమింగ్ మార్చిన సీఆర్టీయూకి ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు బోత్రా నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.