యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

తెలంగాణ టీడీపీని బతికించేందుకే బాబు ప్లాన్

0

తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయ్యింది. ఎల్.రమణ నిష్క్రమించిన తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం నాయకత్వ మార్పునకు సిద్ధమవుతోంది. టీ-టీడీపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అంతర్థానమైనట్టే. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇన్నాళ్లు ఉన్న ఎల్.రమణ తాజాగా రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో ఆఖరి ఆశ కూడా తెలంగాణలో ఆవిరైపోయింది. తెలంగాణలోని తెలుగు పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఇక టీడీపీ తెలంగాణలో ఇన్నాళ్లు ఒంటరిగా పోటీచేయలేకపోయింది. అది కాంగ్రెస్ తో కలిసి గత ఎన్నికల్లో తలపడింది. ఎల్.రమణ రాజీనామాతో ఇప్పుటు రాష్ట్రంలో పూర్తిగా టీటీడీపీ దుకాణం మూసివేసినట్టైంది.

ఈ క్రమంలోనే టీడీపీ చీఫ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీని సజీవంగా ఉంచడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాడట.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఏ సీట్లు గెలిచే అవకాశాలు పూర్తిగా లేవని తెలిసి కూడా.. అసెంబ్లీ ఎన్నికల టార్గెట్ గా చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

గత రెండురోజులుగా చంద్రబాబు.. తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిని నియమించడానికి పార్టీ నాయకులతో తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు భోగట్టా.. పార్టీ నుంచి చాలా మంది నాయకులు వెళ్లినప్పటి ఉన్న వారిలో ఒకరిని ఎల్.రమణకు బదులుగా నియమించాలని తీవ్రమైన కసరత్తును చంద్రబాబు చేస్తున్నాడని సమాచారం.

తెలంగాణ టీడీపీ చీఫ్ పదవికి గట్టి పోటీ ఉన్నట్లుగా చంద్రబాబు మీడియా బృందం తెగ ఊదరగొడుతోంది. ఎల్.రమణ జంపింగ్ ను తక్కువగా చూపుతోంది. ఆయన పోయినా ఏం ఫర్వాలేదు అన్నట్టుగా చెబుతోంది. ఇక చంద్రబాబు సైతం కుల సమీకరణాలు ప్రజాదరణ సినియారిటీ కొత్త అధ్యక్షుడిని నియమించడానికి విధేయత వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

ఈ నివేదికల ప్రకారం.. తెలంగాణ టీడీపీ చీఫ్ పోస్టుకు చంద్రబాబు చంద్రబాబు పలువురు సీనియర్ నాయకులను పరిశీలిస్తున్నారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇప్పుడు కేవలం అలంకారమైనది మాత్రమేనని వారికి బాగా తెలుసు. అందుకే వారు కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

టీ-టీడీపీ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరో ప్రతిపాదన కూడా చేసినట్టు తెలిసింది. తెలంగాణలో ఉంటున్న తన బావమరిది బాలకృష్ణ లేదా కోడలు బ్రాహ్మణిని తెలంగాణలో పార్టీని నడిపించడానికి బాధ్యతలు అప్పగించాలా? ఆసక్తి చూపుతారా? అని అడిగినట్టు తెలిసింది.

సీనియర్ బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని నియమించడం హుజూరాబాద్ ఉప ఎన్నికలలో పార్టీకి సహాయపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ తోపాటు కొత్తగా ఏర్పడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సాపేక్షంగా కొత్త నాయకత్వంతో తెలంగాణలో దూకుడుగా రాజకీయం మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ గట్టి పోరాటం చేయాల్సి వస్తే దానికి బలమైన దూకుడు నేత అవసరం. టీడీపీ అధ్యక్షుడిగా యువ డైనమిక్ నాయకుడిని నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారట.. రేవంత్ రెడ్డి షర్మిల తరహాలో యువ నాయకత్వం కోసం బాబు శూలశోధన చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే వాస్తవం ఏంటంటే.. తెలంగాణ టీడీపీ చీఫ్ గా ఎవరు నియమితులైనా.. తెలంగాణలో టీడీపీ తన కీర్తిని తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అయినప్పటికీ తెలంగాణలో పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలో అంతో ఇంతో బలంగానే ఉందని చంద్రబాబు భావిస్తున్నాయి. దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.