Templates by BIGtheme NET
Home >> Telugu News >> Chandrababu- Telangana Politics: తెలంగాణలోకి చంద్రబాబు రీ ఎంట్రీ..!?

Chandrababu- Telangana Politics: తెలంగాణలోకి చంద్రబాబు రీ ఎంట్రీ..!?


Chandrababu- Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? టీడీపీ బలోపేతం పై ఫోకస్ పెట్టనున్నారా? పార్టీ శ్రేణులను యాక్టివ్ చేయనున్నారా? పాత నాయకులను సైతం యాక్షన్ లోకి తేనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. బీజేపీతో కలిసి నడిచే విషయంలో చంద్రబాబు క్విడ్ ప్రోకు తెరతీశారని వైసీపీ సలహదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీకి ఎదురెళ్లి ప్రతిపాదించారని కూడా ఆరోపించారు. గత నాలుగు నెలలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారని కూడా ఆరోపణ చేశారు. తెలంగాణలో బీజేపీకి సహకరించి.. ఏపీలో తమకు సహకరించాలని ప్రతిపాదన పెట్టారని చెబుతున్నారు. అయితే వైసీపీ ఆరోపణ మాట అటుంచితే చంద్రబాబు మాత్రం బీజేపీ ప్రాపకం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీని కలిసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు టీడీపీ రాజ్యసభ సభ్యులు, తన అనుంగ శిష్యులు సీఎం రమేష్,సుజనా చౌదరిలను సైతం బీజేపీకి పంపించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే అవేవీ బీజేపీకి దగ్గర చేసేందుకు అక్కరకు రాలేదు. అటువంటిది ఉన్నట్టుండి నాలుగేళ్లు గడుస్తున్న సమయంలో చంద్రబాబుకు కేంద్రం నుంచి వరుస ఆహ్వానాలు అందుతున్నాయి. సరైన ప్రాధాన్యత దక్కుతున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. దీనికి బీజేపీ వ్యూహంలో వచ్చిన మార్పే కారణంగా తెలుస్తోంది.

సెటిలర్స్ ఓట్ల కోసం..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో మంచి ఫలితాలు దక్కించుకుంటోంది. దీంతో తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. అటు ఆకర్ష్ మంత్రంతో పాటు పార్టీ బలోపేతం కావడానికి ఏ ఒక్క అవకాశం విడిచిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ షటిలర్స్ ఓట్లపై దృష్టిపెట్టింది. తెలంగాణలో దాదాపు 40 నియోజకవర్గాల్లో ఏపీ సెటిలర్స్ ప్రభావం ఎక్కువ. అందులో ఎక్కువ మంది చంద్రబాబును ఇష్టపడతారు. తెలంగాణలో టీడీపీలో నాయకులు లేకున్నా బలమైన క్యాడర్ ఉంది. దీంతో చంద్రబాబును దగ్గర చేర్చుకుంటే తెలంగాణలో లాభపడవచ్చన్నది బీజేపీ పెద్దల వాదన. అటు ఏపీలో కూడా లోక్ సభ స్థానాల్లో గెలుపొంది బలం పెంచుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదన అయితే ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ అధిష్టానానికి చేరినట్టుతెలుస్తోంది. దీంతో బీజేపీ దీనిపై సీరియస్ గా ఆలోచించుకుంది. నివేదికలు తెప్పించుకుంది. చంద్రబాబు తెలంగాణలో రంగంలోకిదిగితే మాత్రం షటిలర్ష్ ఓట్లు గుంపగుత్తిగాపడే అవకాశమున్న దృష్ట్యా ఆయన వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

వైసీపీ కామెంట్ అదే..
తాజాగా చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశంపై వైసీపీ కామెంట్లు చేస్తోంది. కానీ వైసీపీలో ఓకింత కలవరపాటు మాత్రం కనిపిస్తోంది. తెలంగాణలో క్విడ్ ప్రో అని ఆరోపణలు చేస్తోంది. అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా సిద్ధపడతారని ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో రంగంలోకి దిగుతారని అర్థమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో షటిలర్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 40 నియోజకవర్గాల్లో షటిలర్ష్ అధికంగా ఉన్న దృష్ట్యా వాటి బాధ్యతలను చంద్రబాబు చేతిలో పెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతుందట. ప్రతిఫలంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కు ఇతోధికంగా సాయమందించాలని బీజేపీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఎన్నికలకు ఇంకా 20 నెలల వ్యవధి ఉన్నసమయంలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య బంధం మరింత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చెక్కుచెదరని కేడర్…
తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై సుదీర్ఘ కాలం అవుతోంది. గత ఎన్నికల్లో మహా కూటమిగా కాంగ్రెస్ తో కలిసి పోటీచేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే చాలా నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కించుకోవడం, పది నుంచి 20 వేల ఓట్ల వరకూ సాధించిన నియోజకవర్గాలు సైతం ఉన్నాయి. అయితే చాలామంది నాయకులు పార్టీని వీడారు. కానీ కేడర్ ను మాత్రం తీసుకెళ్లలేకపోయారు. ప్రధానంగా వెనుకబడిన వర్గాల్లో ఇప్పటికీ టీడీపీ ముద్ర ఉంది. వారంతా ఇప్పటికీ టీడీపీని అభిమానిస్తారు. దానిని గుర్తించే కేసీఆర్ ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అది కూడా షటిలర్స్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లోనే జరిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కానీ రంగంలోకి దిగితే తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.