వైఎస్ జగన్‌ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటా హుటిన పులివెందులకు ఏపీ సీఎం

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం. జగన్ మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. గంగిరెడ్డి పార్థీవ దేహాన్ని పులివెందులకు తరలిస్తున్నారు.. అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జరగనున్నాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హుటా హుటిన పులివెందులకు బయల్దేరి వెళ్లనున్నారు.

ఈసీ గంగిరెడ్డి అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లా పొల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది రోజుల క్రితం తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. అక్కడ మామ గంగిరెడ్డిని పరామర్శించారు. కానీ ఇంతలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు.

ఈసీ గంగిరెడ్డి పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.