డిజిటల్ స్ట్రీమింగ్ వార్ లో రెండు సినిమాలు.. రెండు ఓటీటీలు!

0

కరోనా లాక్ డౌన్ కి ముందు ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత ఆరున్నర నెలలుగా థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో సినిమా సందడి లేకుండా పోయింది. కాకపోతే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అంతో ఇంతో ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఒరిజినల్ మూవీస్ – వెబ్ సిరీస్ లను అప్లోడ్ చేస్తూ వస్తున్న ఓటీటీలు.. లాక్ డౌన్ పుణ్యమా అని కొత్త సినిమాలను కూడా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజులకు ప్రొడ్యూసర్స్ మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలలో రెండు సినిమాలు డిజిటల్ వేదికలపై పోటీ పడనున్నాయి. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నిశబ్దం’ మరియు యువ హీరో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాలు ఒకే రోజున వేరు వేరు ఓటీటీలలో రిలీజ్ కానున్నాయి.

కాగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ‘నిశబ్దం’ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆర్. మాధవన్ – అంజలి – షాలిని పాండే ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 2న గాంధీ జయంతి స్పెషల్ గా విడుదల చేస్తున్నారు. తెలుగు తమిళ భాషలతో పాటు మలయాళ డబ్బింగ్ వర్షన్ ని స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. అదే రోజు అంటే అక్టోబర్ 2న తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల కానుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక అయ్యర్ – హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం థియేటర్స్ లో రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవుతున్నట్లుగా.. డిజిటల్ స్ట్రీమింగ్ వార్ లో అమెజాన్ లో ‘నిశబ్దం’ మరియు ఆహాలో ‘ఒరేయ్ బుజ్జిగా’ పోటీ పడనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు బాక్సాఫీస్ లెక్కలు ఏ సినిమా స్టామినా ఏంటో చూపించేవి.. ఇప్పుడు వ్యూయర్ షిప్ చూపిస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఓటీటీ ఆడియన్స్ ని మెప్పించి మంచి వ్యూయర్ షిప్ దక్కించుకుంటుందో చూడాలి.