Templates by BIGtheme NET
Home >> Cinema News >> రజినీ చిత్రాలకు వర్క్ చేయడం నరకం

రజినీ చిత్రాలకు వర్క్ చేయడం నరకం


సూపర్ స్టార్ రజనీకాంత్ – ఏస్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకరు తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంటే.. మరొకరు తన సంగీతంతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చాయి.

రజినీ మార్క్ మ్యానరిజం – స్టైల్ – యాక్టింగ్ కు తగ్గట్టుగా సంగీతం అందించడంలో దిట్ట రెహమాన్. ఈ సక్సెస్ ఫుల్ హీరో-మ్యూజిక్ డైరెక్టర్ కాంబోలో ఇప్పటి వరకు ‘ముత్తు’ ‘అరుణాచలం’ ‘బాబా’ ‘శివాజీ’ ‘రోబో’ ‘కొచ్చాడయాన్’ ‘రోబో 2.0’ వంటి ఆల్బమ్స్ వచ్చాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఇవన్నీ మ్యూజికల్ గా ఆడియన్స్ మెప్పించినవే.

అయితే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాత్రం రజనీకాంత్ సినిమాలకు వర్క్ చేసిన రోజులు అంత ఆహ్లాదకరంగా ఉండేవి కాదని.. ఆయన చిత్రాలకు పని చేయడమంటే నరకంలా అనిపించేదని అంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రెహమాన్.. సూపర్ స్టార్ సినిమాలకు సంగీతం అందించిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

”ఇప్పుడు బాగానే ఉంది. ఆ రోజుల్లో రజనీకాంత్ సినిమాలకు మార్చి నెలలో వర్క్ చేయడం మొదలు పెడితే దీపావళి అయ్యేది. సాధారణంగా దీపావళికి రజినీ సినిమాలు విడుదలయ్యేవి. సినిమాకు పాటలు – బ్యాగ్రౌండ్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. నేనుండే ప్రదేశంలో విద్యుత్ చాలా విరివిగా ఉంటుంది. నా దగ్గర రెండు జనరేటర్లు ఉండేవి. ఇది చాలా నరకం. నేను మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసేవాడిని కాబట్టి రజనీకాంత్ చిత్రాలకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీపావళి అయినా.. న్యూ ఇయర్ అయినా పొంగల్ అయినా అవి నాకు నరకం ఇచ్చేవి. నేను ఎప్పుడూ ఆనందించలేదు కాబట్టి.. ఈ పండుగలన్నింటినీ అసహ్యించుకున్నాను. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ విశ్రాంతి దొరుకుతుంది” అని ఏఆర్ రెహ్మాన్ చెప్పుకొచ్చారు.