Templates by BIGtheme NET
Home >> Cinema News >> BB3 షూటింగ్ రీస్టార్ట్ చేసిన బాలయ్య..!

BB3 షూటింగ్ రీస్టార్ట్ చేసిన బాలయ్య..!


నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ అన్నీ తిరిగి ప్రారంభం అవుతుండటంతో బిబి3 చిత్రీకరణ కూడా స్టార్ట్ చేయాలని బోయపాటి సన్నాహకాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈరోజు(అక్టోబర్ 29) నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బోయపాటి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రభుత్వం సూచించిన కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరపనున్నారు.

కాగా బాలయ్య – బోయపాటిల కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న బోయపాటి – బాలయ్య.. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ అంచనాలకు తగ్గట్టే BB3 ఫస్ట్ లుక్ టీజర్ విశేషమైన స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. గత రెండు చిత్రాల్లాగానే బోయపాటి శ్రీను తనదైన యాక్షన్ పంథాలో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.