దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపించిన సినీ నటి

0

కొద్ది రోజులుగా ఆ వుడ్డు.. ఈ వుడ్డు అన్న తేడా లేకుండా పలు సినీ రంగాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. శాండల్ వుడ్ కు సంబంధించి భారీ డ్రగ్స్ రాకెట్ బయటకు రావటం.. అందులో కన్నడ సినీ రంగానికి చెందిన పలువురికి లింకులు ఉన్నాయన్న అంశం సంచలనంగా మారింది.

జాతీయ మీడియాతో పాటు.. ప్రాంతీయ మీడియా పెద్దగా ఫోకస్ చేయని ఈ అంశం కర్ణాటక రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సినీ నటి రాగిణి ద్వివేదికి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో పాటు.. అందుకు సంబంధించిన ఆధారాలు పెద్ద ఎత్తున సేకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ రవాణాలో ఆమె అరెస్టు కావటంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కించేలా చేసింది. ఓవైపు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆమె.. మరోవైపు దర్యాప్తు అధికారులకు చుక్కలు చూపించిన వైనం బయటకు వచ్చింది.

రెండు రోజులుగా అమెను విచారించిన అధికారులకు.. ఎలాంటి సమాచారం రాని పరిస్థితి. ప్రశ్న ఏదైనా మౌనమే తన సమాధానంగా వ్యవహరించటం.. పొడి పొడి మాటలతో అధికారుల సహనానికి పరీక్ష పెట్టినట్లు చెబుతున్నారు. ఏం అడిగినా ఆమె తిన్నగా సమాధానం చెప్పటం లేదంటూ బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ఆమె వ్యవహరిస్తున్న తీరుతో ఆమెను కనీసం పది రోజులైనా ప్రశ్నించాల్సి ఉంటుందని కోరారు. అయితే.. పది రోజుల విన్నపాన్ని కొట్టేస్తూ.. ఐదు రోజుల పాటు అధికారులు విచారించేందుకు కోర్టు అనుమతిని ఇచ్చింది. ఇదిలా ఉంటే.. కోర్టు విచారణలో హైడ్రామా చోటు చేసుకుంది. తన తరఫున తొలుత ఎంపిక చేసుకున్న లాయర్ స్థానంలో మరొకరికి కేసు అప్పజెప్పారు. అనారోగ్య కారణంగా తన లాయర్ కు బదులుగా మరో లాయర్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణకు హాజరైన ఆమె తానే పాపం చేయలేదన్నారు.

ఆమె తరపు వాదనలు వినిపించిన లాయర్ మరింత ఆసక్తికర వాదనల్ని వినిపించారు. రాగిణి నివాసంలో ఎలాంటి డ్రగ్స్ లభించలేదని.. అలాంటప్పుడు ఆమె నేరం చేసిందని ఎలా ఒప్పుకోవాలని ప్రశ్నించిన లాయర్.. చేయని నేరాన్ని అంగీకరించాలా? దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తున్నారు. కానీ.. అధికారులు కోరుకున్న కోణంలో సమాధానాలు ఇవ్వాలంటే ఎలా? అంటూ వినిపించిన వాదన అధికారులకు సరికొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.

రాగిణి తరఫు న్యాయవాది వినిపించిన వాదనకు కౌంటర్ ఇస్తూ.. అధికారుల తరఫు న్యాయవాది.. డ్రగ్స్ డీల్స్ లో రాగిణి స్వయంగా మాట్లాడేవారని.. ఆమె సరుకును తెప్పించుకున్నట్లుగా ఆధారాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. వాట్సాప్ చాట్ లను తొలగించటం.. సాక్ష్యాల్ని నాశనం చేసిన ఆధారాలు ఉన్నాయంటూ సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారు. ఇదిలా ఉంటే తాజాగా రాగిణి కారు డ్రైవర్ ను అరెస్టు చేయటం.. మరో నలుగురు సినీ నటుల్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉండటంతో.. రానున్న రోజుల్లో ఈ వ్యవహారంలో మరిన్ని సంచలనాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.