‘మహేష్ మూవీ గురించి ఆలోచించేంత మైండ్ స్పేస్ లేదు’

0

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం రణం రుధిరం) తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ మహేశ్ – రాజమౌళి కాంబినేషన్ మాత్రం కుదరలేదు. పదేళ్ల క్రితం వీరిద్దరి మధ్య మొదలైన సినిమా చర్చలు త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నాయి. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మించనున్నారని వెల్లడించారు. దీంతో అభిమానులు సూపర్ కాంబో ఫిక్స్ అయ్యిందని సంబరపడిపోతున్నారు. అయితే రాజమౌళి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబుతో చేయబోయే సినిమాపై మాట్లాడారు.

‘మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు?’ అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. రాజమౌళి దానికి సమాధానంగా ”ఒక సినిమా చేసేటప్పుడు మరో సినిమా గురించి నేను ఆలోచించను. అది ముందు నుండి నాకు అలవాటు. ఇప్పుడు కూడా అంతే. ఆర్.ఆర్.ఆర్ పూర్తయితే కానీ మహేష్ సినిమా గురించి ఆలోచించను. అంత మైండ్ స్పేస్ నాకు ఉండదు” అని చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ పూర్తై విడుదలైన తర్వాత మహేష్ మూవీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయనున్నారనిం అర్థం అయింది. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.