ప్రాధాన్యత పెంచాకే సంతకం చేసిన సాయి పల్లవి

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిన సంగతి తెలిసినదే. పింక్ రీమేక్ `వకీల్ సాబ్` చిత్రీకరణ పూర్తయింది. తదుపరి `అయ్యపనమ్ కోషియం` రీమేక్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడు. ఫిబ్రవరి లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. అయితే ఈలోగానే నాయికను ఫైనల్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహకాల్లో ఉన్నారు.

నిజానికి ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ సాయి పల్లవి కథానాయికగా నటిస్తుందని ప్రచారమైంది. కానీ పారితోషికం విషయంలో హైడిమాండ్ వల్ల మేకర్స్ ఆలోచిస్తున్నారని మరో కథనం వేడెక్కించింది. కానీ వాటన్నిటినీ స్పెక్యులేషన్స్ గా మార్చేస్తూ సాయి పల్లవి ఎట్టకేలకు పవన్ సరసన నటించేందుకు అంగీకరించారని తాజాగా వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ రాజీ అన్నదే లేని ఈ అమ్మడు సడెన్ గా ఏ కారణంతో సంతకం చేసింది? అన్నది ఆరా తీస్తే.. ఈ రీమేక్ లో తన పాత్ర పరిధిని పెంచడం వల్లనే సంతకం చేసిందన్న గుసగుసా వేడెక్కిస్తోంది. నిజానికి స్టార్లతో సంబంధం లేకుండా తన పాత్రకు ఉండే ప్రాధాన్యతను బట్టే సాయి పల్లవి సినిమాలకు ఓకే చెబుతుంటుంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలోనూ దానికే కట్టుబడి ఉందని తెలుస్తోంది. ఇక సాయి పల్లవి ట్యాలెంట్ పైనా ఛరిష్మా పైనా ఉన్న నమ్మకంతోనే దర్శకనిర్మాతలు సర్ధుబాటు చేస్తూ తనని ఒప్పిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. రీమేక్ లో ఆమె పాత్ర పరిధి పెరిగింది. ఈ చిత్రంలో తగిన ప్రాముఖ్యత ఉంది. అందుకే కాల్షీట్లను కేటాయించిందని తెలిసింది. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు పరంగా దిశా నిర్ధేశనం చేస్తున్నారు. రానా ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తుండగా అతడి కోసం వేరొక నాయికను ఫైనల్ చేశారని తెలుస్తోంది.