కల నెరవేరింది సరే.. సక్సెస్ అయ్యాడా…?

0

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్. హాస్యనటుడు నుంచి హీరోగా టర్న్ తీసుకొని అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ‘అందాలరాముడు’ ‘మర్యాదరామన్న’ ‘పూల రంగడు’ వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా సునీల్ హీరోగా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో హీరో వేషాలు మాత్రమే చేయాలని అనుకోకుండా కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ కమెడియన్ కమ్ సపోర్టింగ్ రోల్స్ లో చేయడానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలో రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాలో ఊహించని విధంగా క్లైమాక్స్ లో విలన్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. కాకపోతే సునీల్ ని కమెడియన్ గా హీరోగా చూసిన ప్రేక్షకులు విలన్ గా అంగీకరించలేకపోయారు. ఈ నేపథ్యంలో సుహాస్ – చాందిని చౌదరి జంటగా నటించిన ‘కలర్ ఫోటో’ సినిమాలో మరోసారి ప్రతినాయకుడిగా కనిపించాడు సునీల్.

కొత్త దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన ‘కలర్ ఫోటో’ చిత్రం ఇటీవలే ఆహా ఓటీటీలో విడుదలైంది. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ నీలం – బెన్నీ నిర్మించిన ఈ చిత్రానికి ఓటీటీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తొలివారంలో ఈ చిత్రాన్ని 7 లక్షల మంది చూసినట్లుగా తెలుపుతూ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీకి నేను వచ్చిందే విలన్ అవుదామని.. కానీ మనలో ఏదో కామెడీ సెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా పేరు తెచ్చుకున్నా. ఇప్పుడు ‘కలర్ ఫోటో’తో విలన్ కల కూడా నెరవేరింది” అని పేర్కొన్నాడు. సునీల్ కల నెరవేరింది సరే.. విలన్ గా సక్సెస్ అయ్యాడా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

‘కలర్ ఫోటో’ సినిమాతో నెగెటివ్ రోల్ లో ప్రూవ్ చేసుకోవడానికి సునీల్ చాలా కష్టపడినప్పటికీ.. ప్రేక్షకుల్లో మాత్రం ఒక భీకరమైన విలన్ ని చూస్తున్నామనే భావన కనిపించలేదనే కామెంట్స్ వచ్చాయి. యాక్టింగ్ పరంగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడనే టాక్ వచ్చింది. అందుకే సునీల్ ఇకపై విలన్ వేషాలు పక్కనపెట్టి హీరోగానే కొనసాగుతూ మంచి ప్రాధాన్యత ఉన్న సపోర్టింగ్ రోల్స్ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సునీల్ హీరోగా ఇటీవలే ‘వేదాంతం రాఘవయ్య’ అనే సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ స్టోరీని అందించడంతో పాటు చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ రామ్ ఆచంట – గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో సునీల్ హీరోగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.