‘తలైవి’ ట్రైలర్: మహాభారతానికి ఇంకో పేరు ‘జయ’..!

0

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ”తలైవి – ది రివల్యూషనరీ లీడర్” అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్నాడు. విష్ణు ఇందూరి – శైలేష్ ఆర్ సింగ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు జయలలిత జయంతి సందర్భంగా ‘తలైవి’ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘ఒక సినిమా నటితో మనకు రాజకీయం నేర్పించడం అనేది.. ఇది మగ వాళ్ళ ప్రపంచం మగ వాళ్లే పాలించాలి’ అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. జయలలిత హీరోయిన్ గా ఎదిగిన తీరు రాజకీయ ప్రవేశం.. సీఎంగా ప్రజలకు సేవ చేయడం వంటివి ఇందులో చూపించారు. ఎంజీఆర్ ఆహ్వనం మేరకు రాజకీయాల్లోకి వచ్చినట్లు.. ఆ క్రమంలో అనేక అటు పోట్లు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఇక తమిళనాట అసెంబ్లీలో ఆమెకు జరిగిన అవమానం.. ఎంజీఆర్ అంతిమయాత్రలో తోసేయడం వంటి ఎపిసోడ్స్ ఎంతో ఉద్వేగభరితంగా చూపించారు.

‘మహాభారతానికి ఇంకో పేరుంది.. జయ’ ‘నన్ను అమ్మగా చూస్తే.. నా హృదయంలో మీకు చోటుంటుంది. నన్ను కేవలం ఆడదానిగా చూస్తే..’ అంటూ కంగనా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. జయలలిత పాత్రలో కంగనా.. ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి ఒదిగిపోయారు. సముద్రఖని – మధుబాల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు విజయ్ చాలా గ్రాండియర్ గా 3 నిమిషాలు ఉండేలా కట్ చేసిన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

‘తలైవి’ చిత్రానికి ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ రచన చేశారు. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చారు. ‘తలైవి’ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేయనున్నారు. తమిళనాడు లో త్వరలోనే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ‘తలైవి’ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందేమో చూడాలి.