ఆయనొక్కడే కాదంటే థియేటర్లు తెరవరా?

0

మహమ్మారీ వల్ల ఐదారు నెలలుగా థియేటర్లు .. మల్టీప్లెక్సులు బంద్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ నుంచి సింగిల్ స్క్రీన్స్ సహా మల్టీప్లెక్స్ థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టాలీవుడ్ ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్ యజమానులు తిరిగి పనిలోకి రావడం గురించి చర్చలు జరుపుతున్నారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో సురేష్ బాబు తన వైఖరిని మార్చుకునేందుకు సిద్ధంగా లేనని అన్నారట.

వచ్చే ఏడాది వరకు తన వద్ద ఉన్న లీజు థియేటర్లను తిరిగి తెరవడానికి ఆయన సిద్ధంగా లేరు. అయితే కొందరు నిర్మాతలు ఎగ్జిబిటర్లు ఈ నవంబర్ నుండి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను తిరిగి తెరవడానికి చర్చలు జరుపుతున్నారు. తమ సినిమాల్ని రిలీజ్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారట. దసరా మిస్సయినా కనీసం క్రిస్మస్ నాటికి అయినా సినిమాలు సజావుగా రిలీజ్ చేసుకునే వీలుంటుందని సంక్రాంతికి అది కలిసొస్తుందని భావిస్తున్నారట.

కానీ డి.సురేష్ బాబు తన లీజు థియేటర్లను తెరిచేందుకు సిద్ధంగా లేరు. 2021 వరకూ సురేష్ ప్రొడక్షన్స్ నియంత్రణలో ఉన్న థియేటర్లను తిరిగి తెరిచే మూడ్ లో లేరు. పెద్దాయన నిర్ణయంతో ఇతరులు సందిగ్ధంలో పడ్డారట. అంతేకాదు థియేటర్లు తెరిచినా కంటిన్యూగా ఆడించేందుకు సరిపడా కంటెంట్ లేదని కొందరు వాదించారు. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నందున కంటెంట్ సరిపోదని పలువురు వాదించారట. ఇతర అగ్ర నిర్మాతలు దీనిపై సమాలోచనలు చేస్తున్నారని సమాచారం.