‘విద్యార్థి’టీజర్

0

‘రాజు గారి గది’ ఫేమ్ చేతన్ చీను – టిక్ టాక్ తో ఫేమస్ అయిన బన్నీ వాక్స్(వర్షిణి) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ”విద్యార్థి”. మధు మాదాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహాస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఆళ్ళ వెంకట్ నిర్మిస్తున్నారు. రామకృష్ణ రేజేటి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను దర్శకులు సురేందర్ రెడ్డి – హరీష్ శంకర్.. నిర్మాతలు సాయి కొర్రపాటి – కె.ఎల్. దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు.

కాగా టీజర్ లో “జాతీయ గీతం మీద అంత గౌరవం ఉన్న మీకు మా జాతంటేనే ఎందుకు సార్ అంత కోపం” అని చెప్పడాన్ని బట్టి ఉద్వేగభరితమైన కథతో ‘విద్యార్థి’ రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. ‘ఏంటే తక్కువ నాకొడుకుతో చాలా ఎక్కువగా తిరుగుతున్నావ్’ అనే డైలాగ్స్ ని బట్టి హీరో ఒక నిమ్న కులానికి చెందినవాడనీ.. హీరోయిన్ అగ్ర కులానికి చెందిన అమ్మాయనీ తెలుస్తోంది. “కంచెలు కట్టుబాట్లు మంచి చెడుల మధ్య ఉండాలి.. మనుషుల మధ్య కాదు. మనుషుల మధ్య హద్దులుండాలి.. అడ్డుగోడలు కాదు” వంటి డైలాగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

టీజర్ లవ్ తో పాటు యాక్షన్ ని కూడా చూపించారు. ‘ఎలోన్ ఫైట్ ఫర్ లవ్’ అనే ట్యాగ్ లైన్ తన ప్రేమను గెలిపించుకోవడానికి హీరో ఒంటరిగా పోరాడాడని తెలియజేస్తోంది. ఇక ‘విద్యార్థి’ చిత్రానికి బుల్గేనిన్ సంగీతం అందించగా అనీష్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. రఘుబాబు – మణిచందన – జీవా – టీఎన్నార్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.