Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రభాస్ ని ఎదగనిస్తారా…?

ప్రభాస్ ని ఎదగనిస్తారా…?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోగా కాకుండా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందుతున్నాడు. అయితే దీనికి ప్రధాన కారణం ‘బాహుబలి’ సినిమా అని చెప్పవచ్చు. ఈ మూవీ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ తిరగ రాసింది. ఒక్క సినిమాతో టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రభాస్ ‘బాహుబలి’తో వచ్చిన ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ‘సాహో’ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తో కలిసి పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేశాడు. ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్ స్టామినాని బాలీవుడ్ బాక్సాఫీస్ కి చూపించింది. నెగెటివ్ టాక్ తో 150 కోట్లకు పై వసూళ్లు అందుకున్న ప్రభాస్ ని బాలీవుడ్ లో ఆపడం కష్టమేనని బీ-టౌన్ సర్కిల్స్ లో డిస్కస్ చేసుకున్నారు.

అయితే ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైనప్ చూస్తుంటే త్వరలోనే గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఒక్కో ప్రాజెక్ట్ కు ఒక్కో విధమైన వేరియేషన్ చూపిస్తూ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ప్రభాస్.. నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాజుకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణేని తీసుకున్నారు. ఇదే క్రమంలో లేటెస్టుగా ”ఆదిపురుష్” అనే సినిమాతో బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీ చేయబోతున్నట్లు ప్రభాస్ ప్రకటించాడు. దీంతో మన హీరో బాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్నాడని తెలుగు సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం బాలీవుడ్ లో ప్రభాస్ ని ఎదగనిస్తారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా బాలీవుడ్ లో అవుట్ సైడర్స్ ని.. ఇతర ఇండస్ట్రీల హీరోలను ఎదగనివ్వరనే కామెంట్స్ ఎప్పటి నుంచో వినిపిస్తుంటాయి. ముఖ్యంగా మన సౌత్ హీరోలను ఎంకరేజ్ చేయరని విమర్శలు వస్తుంటాయి. గతంలో చాలామంది సౌత్ హీరోలు బాలీవుడ్ లో పాగా వేయాలని చూసినప్పటికీ.. సక్సెస్ కాలేకపోయారు. అయితే బాలీవుడ్ లోని కొందరు మనవాళ్లను చిన్నచూపు చూడటమే కాకుండా అవకాశాలు రాకుండా చేయడం కూడా దీనికి కారణంగా చెప్తుంటారు. దీంతో పాటు బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం ఫేవరిజం వల్ల స్టార్ కిడ్స్ మాత్రమే ఇండస్ట్రీని ఏలుతుంటారని విమర్శిస్తుంటారు. ఇటీవల అనుమానాస్పద మృతి చెందిన టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి కూడా బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు కారణమని.. బాలీవుడ్ మాఫియాకి అవుట్ సైడర్స్ బలవుతుంటారని కామెంట్స్ వినిపించాయి.

ఈ నేపథ్యంలో ప్రభాస్ ని కూడా తొక్కేస్తారేమో అని తెలుగు సినీ అభిమానులు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో బాలీవుడ్ కి రికార్డ్స్ అనేవి లేకుండా చేసాడు. నిజానికి ‘బాహుబలి – బిగినింగ్’ సక్సెస్ తరువాత అభద్రతాభావంలో పడ్డ బాలీవుడ్ ప్రముఖులు ‘బాహుబలి – కంక్లూషన్’ ‘సాహో’ చిత్రాలని తొక్కేయాలని చూశారనే టాక్ వచ్చింది. ఈ సినిమాలకు బాలీవుడ్ క్రిటిక్స్ నెగిటివ్ రివ్యూస్ తో పాటు దారుణమైన రేటింగ్స్ ఇవ్వడం కూడా ఈ కామెంట్స్ కి బలాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ డైరెక్ట్ హిందీ మూవీని కూడా అనౌన్స్ చేశాడు. అందులోనూ మేకర్స్ బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ కంటే ప్రభాస్ సినిమా కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో మన ప్రభాస్ ని బాలీవుడ్ లో తొక్కేయడానికి ఏమైనా ప్రణాళికలు రచిస్తారేమో అని టాలీవుడ్ అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రభాస్ సినిమాలపై ఎంత దుష్ప్రచారం చేసినా హిందీ ప్రేక్షకులు వాటికి బ్రహ్మరధం పట్టారని.. ప్రభాస్ స్పీడ్ కి బాలీవుడ్ మాఫియా అనబడే వారు బ్రేక్స్ వేయలేరని కామెంట్స్ చేస్తున్నారు.