Templates by BIGtheme NET
Home >> Telugu News >> సంచయిత నిర్ణయాలతో ఇరకాటంలో వైసీపీ సర్కార్?

సంచయిత నిర్ణయాలతో ఇరకాటంలో వైసీపీ సర్కార్?


విజయనగరం జిల్లాలో మాన్సాస్ ట్రస్టుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూసపాటి రాజవంశీయులకు చెందిన ఈ ట్రస్టు చైర్ పర్సన్ గా ఉన్న మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు స్థానంలో బీజేపీ యువమోర్చా నేత సంచయిత గజపతిరాజు కొద్ది నెలల క్రితం నియమితులైన సంగతి తెలిసిందే. సంచయితను వైసీపీ ప్రభుత్వం కావాలని నియమించుకుందని విపక్షాలు గతంలో ఆరోపించాయి.. అయితే కొన్నాళ్లుగా సంచయిత మాన్సాస్ ట్రస్ట్ తోపాటు సింహాచలం దేవస్ధానం వ్యవహారాల్లోనూ తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనను నియమించిన ప్రభుత్వం సూచనలను సంచయిత పట్టించుకోవడం లేదని దేవాదాయశాఖ అధికారులను పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట. తనకు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ ను సంచయిత దుర్వినియోగపరుస్తున్నారని ఈ క్రమంలో వైసీపీ సర్కార్ ను ఇరుకున్న పెడుతున్నారని చర్చించుకుంటున్నారట.

రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సంచయితను వైసీపీ సర్కార్ నియమించిందని గత ఏడాది ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సంచయితకు అనుభవం లేకపోయినా… దేవాదయ శాఖ అధికారుల సూచనలు సహాయసహకారాలతో ముందుకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం గతంలోనే సంచయితకు సూచించిందని తెలుస్తోంది. అయితే ఇటీవల సంచయిత తీసుకున్న కొన్ని నిర్ణయాలు వైసీపీ నేతలతోపాటు దేవాదయ శాఖాధికారులకు నచ్చలేదని తెలుస్తోంది. సింహాచలం దేవస్ధానం బోర్డు ఆమోదించకుండానే తాను నియమించుకున్న ఓఎస్డీ అనధికారికంగా దేవస్ధాన సత్రంలో మకాం వేయడం దాంతోపాటు బోర్డుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించడం వంటి అంశాలపై దేవాదయ శాఖాధికారులు కినుక వహించారని తెలుస్తోంది. విపక్షాల విమర్శలతో ఆ ఓఎస్డీ నియామకాన్ని బోర్డు ఆమోదించినా డ్యామేజీ జరిగిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఇక తాజాగా మాన్సాస్ ట్రస్టుకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఇసుక ర్యాంపులలో తవ్వకాలకు మాన్సాస్ ఈవోకు తెలియకుండా ఏపీఎండీసీతో సంచయిత ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘించి ఏపీఎండీసీతో మాన్సాస్ ట్రస్టు చేసుకున్న ఒప్పందం వల్ల దేవాదాయ గనుల శాఖల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయట. ఈ వ్యవహారంపై దేవాదాయశాఖ కమిషనర్కు మాన్సాస్ ఈవో పిర్యాదు చేయబోతున్నారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంచయిత సొంతగా తీసకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయన్న చర్చ వైసీపీ నేతల్లో జరుగుతోందని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంపై వైసీపీ పెద్దలు సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.