మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన కీర్తి సురేష్…!

0

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీర్తి సురేష్ ‘నేను లోకల్’ సినిమాతో స్థిరపడిపోయింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలు స్టార్ దర్శక నిర్మాతలతో వర్క్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి అద్భుతమైన నటన ప్రదర్శించినందుకు గాను ఆమె ‘జాతీయ ఉత్తమ నటి’ అవార్డును కూడా అందుకుంది. అప్పటి నుంచి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలవైపు.. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల వైపు దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ‘మిస్ ఇండియా’ ‘గుడ్ లక్ సఖి’ ‘రంగ్ దే’ ‘అన్నాతే’ ‘మరక్కార్ అరబికదలింటే సింహం’ వంటి సినిమాలలో నటిస్తున్న కీర్తి సురేష్ మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతోంది.

కాగా కీర్తి సురేష్ తాజాగా ‘సాని కాయిదం’ అనే తమిళ్ సినిమాలో నటిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో కీర్తితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ భుజానికి పొడవాటి కత్తిని కట్టుకొని.. చేతిలో తుపాకీ పట్టుకొని దుండగులకు ఎదురెళ్ళుతోంది. సెల్వ రాఘవన్ కూడా కత్తి పట్టుకొని నిలబడ్డాడు. మహానటి మరోసారి ఛాలెంజింగ్ రోల్ కనిపించబోతోందని అర్థం అవుతోంది. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.