కోమాలో కిమ్.. ఉత్తర కొరియా పగ్గాలు ఆమె చేతికి..?

0

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కొద్ది రోజుల క్రితమే తన సోదరి కిమ్ యో జోంగ్‌కు ప్రమోషన్ ఇచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కాగా కిమ్ కోమాలో ఉన్నారని.. అందుకే యో జోంగ్‌కు కిమ్ తర్వాతి స్థానాన్ని కట్టబెట్టారని తెలుస్తోంది. ఉత్తర కొరియా పగ్గాలను యో జోంగ్ అందుకుంటారని మరోసారి ప్రచారం జరుగుతోంది. దక్షిణ కొరియా దౌత్యవేత్త చాంగ్ సాంగ్-మిన్ ఈ విషయాన్ని వెల్లడించారని కథనాలు వెలువడుతున్నాయి. దివంగత అధ్యక్షుడు కిమ్ డే జంగ్‌ దగ్గర రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా చాంగ్ పని చేశారు.

‘కిమ్ కోమాలో ఉన్నారు. కానీ ఆయన జీవితం ముగిసిపోలేద’ని చాంగ్ చెప్పినట్లు కొరియా హెరాల్డ్ కథనాన్ని వెలువరించింది. అధికార పగ్గాలను పూర్తిగా యో జోంగ్‌కు కట్టబెట్టే ప్రక్రియ జరగలేదు. కానీ సుదీర్ఘ కాలంపాటు శూన్యత ఉండొద్దనే ఉద్దేశంతోనే కిమ్ యో జోంగ్‌ను ముందుకు తీసుకొచ్చారని చాంగ్ తెలిపారు. చైనా నుంచి అందిన సమాచారం ప్రకారం కిమ్ కోమాలో ఉన్నారని చాంగ్ వెల్లడించారు. కిమ్ ఆరోగ్యం క్షీణిస్తోన్న విషయాన్ని ఉత్తర కొరియా దాచిపెడుతోందని ఆయన ఆరోపించారు.

అత్యంత నమ్మకస్తులతో తన అధికారం, బాధ్యతలను పంచుకునేలా కిమ్ ఓ ఏర్పాటు చేశారని… కిమ్ ఆరోగ్య సమస్యలకు ఈ వ్యవస్థతో సంబంధం లేదని దక్షిణ కొరియా నిఘా వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

ఈ ఏడాది కిమ్ అంతగా ప్రజల్లోకి రాలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల రూమర్లు వెలువడ్డాయి. ఏప్రిల్ 11న పార్టీ పొలిట్ బ్యూరో మీటింగ్ సందర్భంగా కిమ్ ప్రజలకు కనిపించారు. ఆ తర్వాత మే 2న ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని కిమ్ ప్రారంభించినట్లు మే 2న మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఈ ఫొటోలు ఫేక్ అని చాంగ్ చెబుతుండటం గమనార్హం.